వాజేడు జాతీయ రహదారిపై హెచ్‌పి ఆయిల్ బంకు ప్రారంభోత్సవం
వెంకటాపురం నూగూరు, జనవరి 25 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ నుంచి గోదావరి వంతెన మధ్య ఎన్‌హెచ్–163 జాతీయ రహదారి పక్కన కొంగాల గ్రామం వద్ద ఆదివారం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన నూతన ఆయిల్ బంకును లాంఛనంగా ప్రారంభించారు. నియమ నిబంధనల మేరకు శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసిన అనంతరం శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లి మహా జాతర శుభ సందర్భంగా ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ నాయకులు హాజరై రిబ్బన్ కట్ చేసి ఆయిల్ బంకును ప్రారంభించారు. బంకు నిర్వాహకులు మాజీ నూగూరు ఏఎంసీ చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బోదెబోయిన బుచ్చయ్య కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, రైతులు, మీడియా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వర్గాల వారిని పేరుపేరునా ఆహ్వానించి స్వాగతం పలికారు. వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో ఇప్పటికే ఒక ఆయిల్ బంకు ఉండగా, పెరుగుతున్న ఇంధన అవసరాల నేపథ్యంలో జాతీయ రహదారిపై మరో బంకు ప్రారంభం కావడంతో ఎన్‌హెచ్–163పై ప్రయాణించే వాహన దారులకు ఇంధన కొరత తీరనుంది. దీంతో వాహనదారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బంకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నరసింహమూర్తి, వాజేడు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పెరుమాళ్ల కృష్ణారెడ్డి, వెంకటాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గంపా రాంబాబు, వాజేడు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు, ఏఎంసీ, జీపీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.






