మేడారం భక్తుల సేవలో రాధా టీఎంటీ స్టీల్
ఉచిత మినరల్ వాటర్ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి, జనవరి 24 తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాధా టీఎంటీ స్టీల్ సంస్థ గత మూడు జాతరల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సంస్థ ఎండీ సుమన్ సరాఫ్, డైరెక్టర్ అక్షత్ సరాఫ్ తెలిపారు. శనివారం మేడారం గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ సరాఫ్ మాట్లాడుతూ ఆసియా ఖండం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే మహాజాతరలో భక్తుల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ఈ ఉచిత మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే మేడారం ప్రాంతంతో పాటు జాతరకు వచ్చే ప్రధాన మార్గాలు, కీలక ప్రదేశాల్లో భక్తులకు అవగాహన కల్పించే బోర్డులను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తృత వ్యాపారం నిర్వహిస్తున్న సంస్థగా సమాజ సేవలో భాగస్వామ్యం కావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా డీపీఓ కొండా వెంకయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, సంస్థ జీఎం వీరేష్‌కుమార్, ఏజీఎం నరేష్ గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్, కంపెనీ డీలర్ గంగిశెట్టి శ్రీనివాస్, లయన్ నాగరాజు, లయన్ చుంచు రమేష్, లయన్ సానికొమ్ము రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






