జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
ములుగు, జనవరి23 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తుల్లో అప్రమత్తత లోపంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జంపన్నవాగులో లోతుల్లోకి వెళ్లిన సమయంలో యువతులు మునిగి కేకలు వేయగా, అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి వారిని రక్షించారు. మరో ఘటనలో భూపాలపల్లి వాసులు మేకల జంపయ్య (36), మేకల సరిత (14), మేకల శిరీష (13) అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో, ఎస్‌డీఆర్‌ఎఫ్ 5వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్‌లు సాహసోపేతంగా నీటిలోకి దిగి ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రక్షించబడిన యువతులు అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు రక్షక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మహా ఆధ్యాత్మిక కార్యక్రమమైన మేడారం జాతరలో ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహి స్తుందని 5వ బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం పేర్కొంటూ సిబ్బందిని అభినందించారు. అధికారులు జంపన్నవాగులో లోతుల్లోకి దిగొద్దని భక్తులను మరోసారి హెచ్చరించారు.







