అంగరంగ వైభవంగా గట్టమ్మ తల్లి ఎదురు పిల్ల పండగ
ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు
ములుగు,జనవరి21, తెలంగాణజ్యోతి : ఆదివాసి నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు, గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం కుటుంబ సమేతంగా స్థానం ఆచరించిన అనంతరం పూజారులు గట్టమ్మ ఆలయ ఆవరణను పూలతో అలంకరించి, ఉదయం 4 గంటల సమయం లో గట్టమ్మ దేవాలయం వెనుక భాగంలోని అడవుల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టమ్మ తల్లి తిరిగిన మూడు గుహల (స్వరంగలు) ఆనవాళ్ల వద్ద పట్టు వస్త్రాలు ధరించి ఐదు మట్టి కుండల నీటితో కుంకుమ, భరణీలు, నిమ్మకాయ, గుడ్డు, అగరబత్తులతో సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వపు గట్టమ్మ తల్లి వెలసిన దేవర గుడి వద్ద పూజలు చేసి, ప్రస్తుతం ఉన్న గట్టమ్మ ఆలయానికి చేరుకుని తల్లివారికి బండారి (పసుపు) సమర్పించడంతో ఎదురు పిల్ల పండగ ప్రారంభమైంది.

డోలు వాయిద్యాలతో భారీ ర్యాలీ..
ఉదయం 10 గంటల సమయంలో ఇంటికొక బోనంతో ములుగు జిల్లా కేంద్రంలోని ఆదివాసి నాయకపోడు కమిటీ హాల్, డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో భారీ ర్యాలీగా పూజారులు గట్టమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. లక్ష్మీదేవి, కృష్ణస్వామి, పోతురాజు, పంచపాండవులు, ఎర్రగొండ రాక్షసి, తెల్లగొండ రాక్షసి, నాయకపోడుల మాస్కులతో ఆదివాసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ములుగు, రొయ్యూరు, సింగారం, బూర్గుపేట, చల్వాయి, పత్తపల్లి, వెంకటాపూర్, సీతారాంపురం, ఏటూరునాగారం, కమలాపూర్, వీరాపూర్, ముప్పనపల్లి, కడేకల్ తదితర గ్రామాల నుంచి ఆదివాసీ నాయకపోడ్లు 14 లక్ష్మీదేవరలను ప్రత్యేకంగా అలంకరించి డోలు మోగిస్తూ గట్టమ్మ చెంతకు తరలివచ్చారు.

యాట మొక్కులు, బోనాలతో నైవేద్యం
నాయకపోడు మహిళలు ములుగు నుంచి గట్టమ్మ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన 70బోనాలతో తరలివెళ్లి తల్లికి నైవేద్యం సమర్పించారు. ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో పూజా సామగ్రిని వెదురు బుట్టలో తీసుకువెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె, గాజులు సమర్పించి ఒడిబియ్యం పోశారు. ఎదురు పిల్ల పండగ సందర్భంగా యాటపోతుల మొక్కులు చెల్లించారు. గట్టమ్మ గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసిన అనంతరం బోనం సమర్పించి, సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద కూడా దీప దూప నైవేద్యాలు అర్పించడం తో వేడుకలు ముగిశాయి. ఈ సంప్రదాయం తమ తాతల తరం నుంచి కొనసాగుతోందని పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య, కొత్త లక్ష్మయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆకుల రాజు, ఆకుల రఘు, కొత్త రవి, చిర్ర ముతేష్, చిర్ర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






