డోలు మోగగా.. తోరణాలు కట్టగా.. మేడారం జాతర ఆరంభ సూచన
సంప్రదాయం–సంకల్పం కలిసిన ఘట్టం
మండమేలిగెతో మేడారం సన్నద్ధం
ములుగు, జనవరి21, తెలంగాణజ్యోతి : ఆదివాసీ సంస్కృతి, శతాబ్దాల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతర మహా ఘట్టానికి నేడు (బుధవారం) శుభసూచికగా మండమేలిగె పండుగ ఘనంగా జరగనుంది. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆరాధనతో మేడారం, కన్నెపల్లి, పూనుగొండ్లకామారం, కొండాయి తదితర గ్రామాల్లో డోలు మోగుతూ, మామిడి తోరణాలతో గ్రామదేవతల ఆలయాలు పండుగ కళతో వెలిగిపోనున్నాయి. జాతర ప్రశాంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలన్న సంకల్పంతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాల చివర స్తంభాలు నాటి మామిడి తోరణాలు కడతారు. పూజారులు పూజాసామగ్రిని శుద్ధి చేసి ఆలయాలను శోభాయమానంగా అలంకరించడంతో జాతర రెండో ఘట్టానికి అధికారికంగా శ్రీకారం చుట్టబడుతుంది. ఒకప్పుడు అడవుల నుంచి తెచ్చిన వాసాలు, దూలాలు, మొగురాలు, గడ్డితో గుడిసెలు నిర్మించి అమ్మవార్లను ప్రతిష్టించే సంప్రదాయం ఉండగా, కాలానుగుణంగా ఇప్పుడు భవనాల్లోనే అదే తంతును ఘనంగా కొనసాగిస్తున్నారు. ఈ ఆచారాన్ని తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో ఫైలాన్ ఆవిష్కరణ చేసి గద్దెలను ప్రారంభించగా, మహా జాతరను విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రి సీతక్క అహర్నిశలు కృషి చేస్తున్నారు. మండమేలిగె పండుగతో మేడారానికి భక్తుల రాక మరింత వేగం పుంజుకోనుంది.






