రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, దుస్తుల పంపిణీ
వెంకటాపురం , జనవరి 20 (తెలంగాణ జ్యోతి): రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు పంచాయతీ పరిధి కొండాపురం గ్రామంలో నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ గౌరవ జిష్ణు దేవ్ వర్మ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు టి.ఎస్. దివాకర ఆదేశాలతో, అభయ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 20 నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరవీడు సర్పంచ్ ఇర్పా మురళి, ఉపసర్పంచ్ కొర్సా మురళి, జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు చెరుకూరి సతీష్ హాజరై లబ్ధిదారులకు దుప్పట్లు, దుస్తులు అందజేశారు. సర్పంచ్ ఇర్పా మురళి మాట్లాడుతూ మారుమూల మండలమైన వెంకటాపురంలోని కొండాపురం గ్రామంలో నిరుపేద ఆదివాసీలకు రెడ్ క్రాస్ సేవలు అందడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6 కుర్తాలు, 44 పిన్నీలు, 44 బ్లౌజులు, 16 బ్లాంకెట్లు, 44 నెక్కర్లు, 6 పైజామాలు, 26 ట్రౌజర్లు, 66 షర్టులు తదితర దుస్తులు పంపిణీ చేశారు. గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.






