ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
ఏటూరునాగారం, జనవరి 2, (తెలంగాణ జ్యోతి) : మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ బాయ్స్ స్కూల్‌లో ఆర్బిఎస్కే (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) ఆధ్వర్యంలో విద్యార్థు లకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్బిఎస్కే వైద్యాధికారి డాక్టర్ బి. నరహరి విద్యార్థులకు వివరించారు. జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ జె. తిరుపతి ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 186 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, అందులో 12 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచిత కంటి అద్దాలు అందజేయనున్నట్లు డాక్టర్ నరహరి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు బానోతు రాజు నాయక్, ఫార్మసీ ఆఫీసర్ సిహెచ్. భాస్కర్, ఆర్బిఎస్కే ఏఎన్ఎం రజిని, టి జి టి డబ్ల్యూ ఆర్ ఎస్ బాయ్స్ స్కూల్ ఏఎన్ఎం శంకరమ్మ పాల్గొన్నారు.






