గిరిజన గ్రామాల్లో ఇంటింటి జ్వరాల సర్వే
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 31 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిప్పాపురం సబ్ సెంటర్కు చెందిన పెంకవాగు గిరిజన గ్రామంలో బుధవారం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలిసి ఇంటింటి మలేరియా–జ్వరాల సర్వే నిర్వహించారు. సర్వే సందర్భంగా గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, నెలవారీ మందుల వినియోగం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మందులు క్రమం తప్పకుండా వాడాలని, వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుత చలికాలంలో శరీరం మొత్తం కప్పే వస్త్రాలు ధరించాలని తెలిపారు. ఈ సందర్భంగా రక్తపూత (మలేరియా) నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, జలుబు–దగ్గు మందులు పంపిణీ చేశారు. బాలింతలకు అవసరమైన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






