కాటారంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డి ఏ ఓ
కాటారం, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఎరువుల సరఫరా పారదర్శకంగా, సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు తెలిపారు. మంగళవారం ఆయన, మహాదేవపూర్ ఏడీఏ శ్రీపాల్‌తో కలిసి మండలంలోని పలు ఎరువుల డీలర్ అవుట్‌లెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్ కేంద్రాల్లో ఉన్న యూరియా నిల్వలను FIVES యాప్ ద్వారా ధృవీకరించ డంతో పాటు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ విధానాలను సవివరంగా పరిశీలించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీలర్లకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల అక్రమ నిల్వలు లేదా అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






