సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలు విజయవంతం : జిల్లా ఎస్పీ
కాటారం, డిసెంబర్18,తెలంగాణజ్యోతి :భూపాలపల్లి జిల్లాలో నిర్వహిం చిన గ్రామపంచాయితీ ఎన్నికలు మూడు విడతలుగా పూర్తిగా శాంతి యుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయం, పోలీసు విభాగం కర్తవ్యనిష్ఠతో పనిచేయడం ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. భూపాలపల్లి జిల్లా సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బందితో సహా 950 మందికి పైగా పోలీసు సిబ్బంది విడతల వారీగా ఎన్నికల భద్రత కోసం అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునుంచే జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 4 చెక్పోస్టుల్లో వాహనాలపై క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించడంతో పాటు గ్రామాలలో మరియు రహదారూలపై బాంబ్ స్కార్డ్ టీములతో లతో విస్తృతంగా నిఘా కొనసాగించామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో రూ.8,400 నగదు, రూ.14 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు, వివిధ చట్టవిరుద్ధ చర్యలకు సంబంధించి 107 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా, గత ఎన్నికల్లో ఘర్షణలకు కారణమైన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై ముందస్తు చర్యలుగా 139 కేసుల్లో 377 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో చలి, పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కర్తవ్యదీక్షతో పనిచేసిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు, వివిధ శాఖల అధికారులు, పోలీసు విభాగం అందరూ సమన్వయంతో పనిచేయడంతోనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.






