కేంద్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
ములుగుప్రతినిధి డిసెంబర్18,తెలంగాణ జ్యోతి : ములుగు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఈడీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై ఎంతమంది తప్పుడు కేసులు పెట్టినా పార్టీ భయపడదని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ మరియు మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






