గుండెపోటుతో వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ మృతి
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 18 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా విధులు నిర్వహిస్తున్న గొట్టం రాజేంద్రప్రసాద్ బుధవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజేంద్రప్రసాద్ గత రెండేళ్లుగా వెంకటాపురం ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తూ సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించగా, జిల్లా అధికారుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, నూతనంగా గెలుపొందిన పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. మృతదేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.







