ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం : కేవీపీఎస్ విమర్శ
ములుగు, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ విమర్శించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల మురళి ఆధ్వర్యంలో బస్టాండ్ పరిసరాల్లోని మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించగా, నూతన బస్టాండ్ నిర్మాణం పేరుతో పాత మూత్రశాలలను నిర్మాణ సామాగ్రి నిల్వలకు ఉపయోగించడం వల్ల అవి పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలిపారు. దీంతో జిల్లా కేంద్రానికి పది మండలాల నుంచి వచ్చే ప్రజలు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజాధనంతో నిర్మించిన మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురాకుండ మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బస్టాండ్ నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశమున్నందున, మున్సిపాలిటీ పరిధిలోని మూత్రశాలలను తక్షణమే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కేవీపీఎస్ నాయకులు దేవేందర్, చంటి, రాజేందర్, మురళి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






