భూపాలపల్లి జిల్లాలో 2వ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): జిల్లాలో 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయం నుండి 2వ దశ గ్రామ పంచాయతి ఎన్నికలు నిర్వహణకు 13వ తేదీన పోలింగ్ మెటీరియల్ పంపిణీ, 14వ తేదీన పోలింగ్, ఓట్లు లెక్కింపు తదితర అంశాలపై రెవెన్యూ, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతి రాజ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకు పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ. కేంద్రాల్లో మెటీరియల్ తీసుకున్న సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని 14వ తేదీన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండిమధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. తదుపరి ఖచ్చితంగా మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని.పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 2 గంటలకు ప్రారంభం కావాల్సి న ఓట్లు లెక్కింపు ఆలస్యం జరిగితే తెలియచేయాలని, ఆలస్యానికి కారణాలు తెలియచేస్తూ ఎన్నికల సంఘానికి తెలియ చేయాల్సి ఉంటుం దని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే సాధారణ ఎన్నికల పరిశీలకుల అనుమతితో డిక్లర్ చేయాలని తెలిపారు. రెండవ విడత పోలింగ్ జరిగే మండలాల అధికారులు, సిబ్బందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికపుడు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో గ్రామాల వారిగా 3 భాగాలుగా విభజించి ఇంచార్జీలను నియమించాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ లేని చోట మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, డీఈఓ రాజేందర్, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, ఆర్డిఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసిల్దారులు, ఎంపీఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.






