ములుగు జిల్లా కేంద్రంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ములుగు, డిసెంబర్ 10, తెలంగాణ జ్యోతి : అనారోగ్య కారణాలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగులోని రమ్య హోటల్ నిర్వాహకుడి అల్లుడు అయిన నక్క రామకృష్ణ (40) టిఫిన్ సెంటర్, హోటల్ నిర్వహణలో చేదోడుగా ఉండేవాడు. ఇటీవల ఆంధ్ర నుంచి భార్య, ఇద్దరు కుమారులతో కలిసి వచ్చిన ఆయన ప్రత్యేకంగా జ్యూస్ సెంటర్, మిర్చీ బండి కూడా నిర్వహిస్తున్నాడు. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. కాగా, రామకృష్ణది ఆంధ్ర కావడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంతిమక్రియల నిమిత్తం సొంతూరికి తరలించారు.






