జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
– అతివేగంతో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
– తండ్రి మృతి, కొడుక్కు తీవ్ర గాయాలు
ఏటూరునాగారం, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : అతివేగం వృద్ధుడి ప్రాణం తీసింది. తండ్రీ కొడుకులు బైక్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ లోనే చనిపోయారు. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న వరంగల్ 2డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లక్సరీ బస్సు అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న తండ్రీ కోడుకులు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రి కాసం సంజీవ రెడ్డి(60) స్పాట్ లోనే చనిపోగా కుమారుడు భరత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ ను ఢీకొట్టిన అనంతరం అదే వేగంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ తోపాటు కొందరు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. తవ్రంగా గాయపడ్డ భరత్ రెడ్డిని ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






