గ్రామ అభివృద్దే నా ఆశయం
– చిన్నబోయినపల్లి సర్పంచ్ అభ్యర్థి నల్లబోయిన నాగార్జున
ఏటూరునాగారం, డిసెంబర్ 08, తెలంగాణ జ్యోతి : మండల పరిధి లోని చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్ల బోయిన నాగార్జున తన గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో మాట్లాడుతూ.. సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే గ్రామంలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం, వీధిదీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడం, కోతుల బెడదను తగ్గించే చర్యలు, అలాగే డీఎన్టీ పాఠశాలకు సముచితమైన కాంపౌండ్ గోడ నిర్మాణం వంటి పనులను అత్యవసరంగా చేపడతానని తెలిపారు. అదేక్రమంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి అవరోధం లేకుండా చేరేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్ని రంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చిన్నబోయినపల్లి భవిష్యత్తు అభివృద్ధికి ఉంగరం గుర్తుకు ఓటు వేసి విశేష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను నాగార్జున విజ్ఞప్తి చేశారు.






