ముగిసిన మూడో విడత నామినేషన్లు
బాణాసంచా పేల్చుతూ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు
కాటారం, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో మూడో విడత లో కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, మలహర్ మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో శుక్రవారం నామినేషన్లు జోరుగా వేశారు. చాలా క్లస్టర్లలో నామినేషన్లు వేసే సమయం ఐదు గంటలకు ముగిసినప్పటికీ అభ్యర్థులు వేచి ఉన్నారు. కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపరుస్తున్న మాజీ ఎంపిటిసి జాడి మహేశ్వరి నామినేషన్ వేశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్శిని భర్త జక్కు రాకేష్, బిఆర్ఎస్ కాటారం మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పంతకాని సడువలి, బీజేపీ నుండి దుర్గం తిరుపతి, గంట అంకయ్య పలువురు అభ్యర్థులు కాటారం సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేశారు నామినేషన్ వేసే ముందు గారేపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గారేపల్లి చౌరస్తా నుండి గ్రామపంచాయతీ క్లస్టర్ కేంద్రం వరకు టపాసులు పేల్చుతూ, డప్పు వాయిద్యాలతో ప్రజలకు నమస్కరిస్తూ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయా పార్టీల కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి నరేష్ కుమార్
మహాదేవపూర్, కాటారం మండలాల్లోని నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు.






