Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు
– డీసీసీ అధ్యక్షునిగా అశోక్
ములుగు, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పైడాకుల అశోక్ పగ్గాలు అందుకోనున్నారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన అశోక్ కు ఈ పదవి దక్కడం ముచ్చటగా మూడోసారి. 2019లో జిల్లా ఏర్పాటు అయ్యాక డీసీసీ అధ్యక్షునిగా నియామకమైన నల్లెల్ల కుమారస్వామి అకాల మరణంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అశోక్ రెండో సారి కూడా లాంఛనంగా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రి సీతక్కకు ప్రధాన అనుచరునిగా పేరు తెచ్చుకున్న ఆయన ములుగు నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సీతక్క గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు చేసిన వ్యక్తులకు మళ్లీ అధ్యక్ష పదవి దక్కదు అనడంతో కొంత సందేహం కలిగినా రానున్న పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ పీఠం ఎస్టీలకు రిజర్వు కావడంతో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం మళ్లీ పైడాకుల అశోక్ క్ కే దక్కింది. ఆరుగురి నామినేషన్లలో ఆశావహులందరికీ ఈ నిర్ణయంతో నిరాశే ఎదురైనట్లయింది. కాగా, అశోక్ మూడోసారి అధ్యక్ష పీఠం ఎక్కనుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






