ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలి
– జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్
వెంకటాపురం నూగూరు, నవంబర్ 21 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి పై కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని, మొక్కజొన్న పంటకు సంబంధించిన ఎరువులు, పురుగుమందులు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకు అమ్మ కూడదని సూచించారు. అగ్రిమెంట్లపై నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు జె. అవినాష్ వర్మ మాట్లాడుతూ ఆర్గనైజర్లు పంట పొలాలకు జీపీఎస్ నమోదు చేసే సమయంలో రైతుల అంగీకారం, సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని, అలాగే కొనుగోలు చేసే ఎరువులు, పురుగుమందులకు బిల్లులు ఉండాలి అని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కంపెనీ వారీగా ఏ గ్రామంలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు అనే వివరాలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్గనైజర్లు నరసింహమూర్తి, ప్రసాద్, నాగరాజు, రాంబాబు తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.






