వాజేడు హైస్కూల్‌లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
వెంకటాపురం, నవంబర్20,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వాజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం అవగాహన కార్యక్రమంలో సోషల్ వర్కర్ కడారి సుమన్, చైల్డ్ హెల్ప్‌లైన్ కేసు వర్కర్ చంటి, ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు మాట్లాడుతూ, బాలలు శారీరక ఎదుగుదలను అర్థం చేసుకొని భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలని, జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు. బాలల హక్కులు ఉల్లంఘితమైతే వెంటనే 1098 కు ఫోన్ చేయాలని, బాల్యవివాహాల వంటి అనర్ధాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కులు వంటి ప్రాథమిక హక్కులపై ప్రతి బాలబాలికకు అవగాహన అవసరమని చెప్పారు. అలాగే బాలికలు తమ హక్కులను తెలుసుకొని పోటీ ఆత్మతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందుకు సాగాలని సూచించారు. పిల్లలపై లైంగిక దాడులు, బాల్యవివాహాలు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, ఏ ఇబ్బందులు ఎదురైనా 1098 లేదా 112 కు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్లగురుగుల మల్లయ్య, తెల్లం రాజ్యలక్ష్మి, బొగ్గం కుమార్‌బాబు, కోకిల శ్రీరంగం, జర్పుల వస్యతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






