వరంగల్ 2డిపో బస్సులో మహిళా ప్రయాణికురాలి పై చేయి చేసుకున్న ఆర్టీసీ కండక్టర్..?
– తల్లిని కొట్టడంతో మల్లంపల్లి వద్ద కండక్టర్ పై దాడిచేసిన కొడుకు
– మొదట మహిళా ప్యాసింజర్ తో కండెక్టర్ కు తలెత్తిన వివాదం
– ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ సిబ్బంది, అధికారులు
– ఏటూరునాగారం రూట్ బస్ లో ఘటన
ములుగు ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో ఓ మహిళ బస్సు బానట్ పై కూర్చునేందుకు ప్రయత్నించగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఆర్టీసీ బస్ డ్రైవర్, కండర్ పై మహిళ దూషణలకు దిగడంతో కండక్టర్ మహిళపై దాడి చేసిందని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లలో ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తల్లిని కొట్టడంతో కొడుకు తీవ్రంగా రియాక్టై బస్ ను అడ్డగించి కండక్టర్ పై దాడిచేయడంతో ములుగులో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వరంగల్ 2డిపోకు చెందిన హన్మకొండ – ఏటూరునాగారం రూట్ బస్ లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 2డిపోకు చెందిన టీజీ 03టీ 0459 నెంబరుగల ఏటూరునాగారం రూట్ బస్ మధ్యాహ్నం హన్మకొండ నుంచి బయలు దేరింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో ఆత్మకూరు మొదటి బస్టాండ్ వద్దకు చేరుకోగానే ఓ 50 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలు బస్ ఎక్కారు. కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో డ్రైవర్ సీటు పక్కన ఉన్న బానట్ పై మహిళ కూర్చుంది. దీంతో డ్రైవర్ ఇక్కడ కూర్చోవద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో కండక్టర్ సీహెచ్.కమలాకర్ రెడ్డి మహిళను అక్కడి నుంచి లేవాలని పట్టుబట్టాడు. వెంటనే మహిళ దూషణలకు దిగడంతో కోపోద్రిక్తుడైన కండక్టర్ మహిళను బానట్ పై నుంచి లాగినట్లు ప్రయాణీకులు తెలిపారు. వివాదం ముదరడంతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కండక్టర్, సదరు మహిళా ప్రయాణీకురాలు ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై పిటీషన్ తీసుకున్న అనంతరం బస్సులో ఇతర ప్రయాణీకులు ఎక్కువగా ఉండటంతో బస్సును పంపించారు. సదరు మహిళ ఈ విషయాన్ని తన కొడుకుకు చెప్పడంతో వెంటనే తల్లిని బైక్ పై ఎక్కించుకొని మల్లంపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు బైక్ ను అడ్డంపెట్టి ఆపాడు. కండక్టర్ పై మహిళతో పాటు ఆమె కొడుకు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ పై దాడికి పాల్పడ్డ సంఘటనను ఆర్టీసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వరంగల్ 2 డిపోకు చెందిన జీఎం, డీఎంలు ములుగుకు వచ్చి బాదితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు సైతం పలువురు ప్రయాణీకుల నుంచి వాంగ్మూలం సేకరించారు. కాగా, మధ్యాహ్నం 3గంటలకు మొదలైన వివాదం సాయంత్రం ములుగులో 5గంటల వరకు కొనసాగింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.