కన్నాయిగూడెం మండలంలో ప్రారంభమైన మూడో విడత నామినేషన్
కన్నాయిగూడెం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : మండలంలోని రైతు వేదికలో మంగళవారం మూడో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ పదవికి తుపాకులగూడెం గ్రామానికి చెందిన పీర్ల స్వప్న (సురేష్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొట జ్యోతి (నాగేష్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన యువతతోనే సాధ్యమని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తేనే సమాజ సేవలో నిజమైన మార్పు వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా యువత, నిరుద్యోగుల అంకిత భావంతోనే సాధ్యమైందని గుర్తుచేశారు. యువత తలుచుకుంటే గ్రామాలే కాదు, రాజ్యాలు కూడా మారగలవని, గ్రామాల అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని తెలిపారు. ప్రజలు యువ నాయకులను ప్రోత్సహించి, ఆదర్శవంతమైన గ్రామాల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, పార్టీ కార్యకర్తలు, యువతీ–యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






