గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ఇసుక లారీ
– స్పాట్లో చనిపోయిన జీపీ కార్మికుడు సారయ్య
– మరో ముగ్గురు కార్మికులకు తప్పిన ముప్పు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : గ్రామపంచాయతీ కార్మికులు చెత్త సేకరిస్తుండగా ట్రాక్టర్ ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో కార్మికుడు స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికు లు, జీపీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు లోని ఎస్సీ కాలనీకి చెందిన బల్గూరి సారయ్య (52) గతంలో హమాలీ కార్మికునిగా పట్టణ వాసులకు సుపరిచితుడు. గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా కొన్నేళ్ల క్రితం నుంచి పనిచేస్తున్న సారయ్య మంగళవారం సాయంత్రం చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తూ మరో ముగ్గురు కార్మికులు పైడి, రాజేందర్, వెంకన్నలతో కలిసి డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారిపై చెత్త సేకరణ చేస్తున్నారు. ఎన్ హెచ్ పై నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తొలగించగా దానిని సేకరిస్తుంగా సారయ్య ట్రాక్టర్ ట్రాలీలో ఉండి నేర్పుతున్నాడు. అయితే ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సారయ్య ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపో యాడు. తోటి కార్మికులు చెత్త సేకరిస్తుండగా తాము సైతం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. కాగా, జీపీ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు సారయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండ గా అందరికీ వివాహాలయ్యాయి. భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి జీపీ కార్యదర్శి రఘు, కార్మికులు, మాజీ పాలకవర్గం సభ్యులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్మికుని మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.