ఎత్తు బంగారంపై నిబంధనలు ఎత్తివేయాలి
– డా. సుతారి సతీష్
ములుగు, తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఒక్కో జాతరకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా, మేడారం జాతరలో చాలా ప్రధానమైంది ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు సమర్పించడం. బంగారం సమర్పించకుండా ఏ భక్తుడు కూడా మేడారం జాతర పూర్తిచేసుకోలేడు. అలాంటిది, బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డు నకలు, ఫోన్ నెంబర్, ఇంటి చిరునామా తీసుకోవాలని ఎక్సయిజ్ అధికారులు ఆదేశించడం భక్తులను జాతరకు దూరం చేయడమే అవుతుందని సామా జిక కార్యకర్త డా. సుతారి సతీష్ తెలిపారు. భక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించడమే అని, ఈ సమాచారం ద్వారా భక్తుల కు భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ఎక్సయిజ్ శాఖ బాధ్యత వహిస్తుందా అని ? ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన ఆదేశాలు నిలిపివేసి, నిజంగా పక్కదారి పట్టే బెల్లంపై, అట్టి వ్యక్తులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలె గాని, సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని హితవు పలికారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, జాతరను సాధారణ ప్రజల నుండి దూరం చేయడమే అవుతుందని, ఇట్టి నిబంధనలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.