గిరిజనేతరుల అక్రమ పట్టాలను రద్దు చేయాలి
వెంకటాపురం నూగూరు, మార్చి16,తెలంగాణజ్యోతి : గిరిజనేతరులు అక్రమంగా పొందిన భూమి పట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గోడ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నాయకులు ములుగు ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి మాట్లాడుతూ ములుగు జిల్లా వాజేడు మండలం లోని రెవెన్యూ గ్రామాలు ఏడుచర్లపల్లి (జడ్) సర్వే నెం.91లో 8 ఎకరాలు, ముత్తారం (జి) సర్వే నెం.15/2లో 11 ఎకరాలు, 15/1లో 1.37 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు 1/70 చట్టానికి విరుద్ధంగా అక్రమ పట్టాలు పొందారని ఆర్డీవోకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. భూ ప్రక్షాళన సమయంలో కొంతమంది రెవెన్యూ అధికారులు చట్టాలను పక్కనబెట్టి గిరిజనేతరులకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు వందల ఎకరాల ప్రభుత్వ భూములు అధికారులు కేటాయించారని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై ఆర్టికల్ 244(1) ప్రకారం ఆదివాసీలకే హక్కు ఉంటుందని, గిరిజనేతరులకు హక్కు ఉండదని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మండలంలోని సర్వే నెంబర్లు 116 మరియు 9లో ఒక గిరిజనేతరుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా పట్టా పొందినట్లు ఆరోపిస్తూ, ఆ పట్టాలను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పూనేం మునీశ్వరావు తదితరులు పాల్గొన్నారు.






