క్రీడలను కెరీర్ గా మలుచుకోవచ్చు
– జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
– జోనల్ మీట్ ముగింపు వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు అందజేత
ములుగు ప్రతినిధి : క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడుతాయని, కెరీర్ గా కూడా మలుచుకోవచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా కాలేశ్వరం జోన్ కు సంబంధించి 10వ జోనల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ ఈనెల 11 నుంచి 14వరకు ములుగు మండలం జాకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిర్వమించిన ఆటల ముగింపు కార్యక్రమం గురువారం జరుగగా ఎస్పీ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడల్లో ఆసి ఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్ తక్రా, బాల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు.ఈసందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలవేసిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలలో జట్టు గెలుపు కోసం సభ్యులందరూ కలిసి ఆడుతారో మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పాలు పంచుకోవాలని, విద్యార్థి దశలో చెడు విషయాలు తొందరగా ఆకర్షిస్తాయని, వాటికి లొంగకుండా మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలన్నారు. చదువు, క్రీడలు రెండు విద్యార్థి దశలో కీలక పాత్ర పోషిస్తాయని, ఆ రెండిటిని సమతుల్యoగా చూస్తూ ఉన్నతమైన భవిష్యత్తుకు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో చాలా నైపుణ్యం దాగి ఉంటుందని, వారు ఏ మాత్రం ఎవరికీ తీసిపోరన్నారు. తాను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాడినే అని, ఈ స్థానంలో నిలబడడానికి విద్యార్థి దశ నుండి ఐపీఎస్ వరకు చాలామంది గురువుల ప్రోత్సాహం ఉంద న్నారు. ప్రతి ఒక్కరూ వారి గురువులను గౌరవిస్తూ వారు నేర్పిన పాటల ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఈ క్రీడల్లో ఆల్ రౌండ్ పర్ఫా ర్మెన్స్ ట్రోఫీని జాకారం స్కూల్ విద్యార్థులకు ఎస్పీ అందజే శారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి అరుణకుమారి, డీసీ వో శ్రీనివాసరావు, బిక్షపతి, జోనల్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, 11పాఠశాలల ప్రిన్సిపల్స్, పీఈటీలు పాల్గొన్నారు.