ములుగు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు
నాయకుల కృతజ్ఞతగా సీఎం, మంత్రి సీతక్కకు పాలాభిషేకం
ములుగు, మార్చి 18, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.1.25 కోట్ల నిధులతో 10 స్వచ్ఛ ఆటోలు, ఒక డోజర్ మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం మధ్యాహ్నం ములుగు గాంధీ పార్క్ వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత నిప్పుల బిక్షపతి అధ్యక్షతన పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి మాట్లాడుతూ ములుగు మున్సిపల్ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి సుమారు రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఆ నిధులతో 10 స్వచ్ఛ ఆటోలు, డోజర్ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా మున్సిపల్ అభివృద్ధికి రూ.30 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు కావాలని ఆశిస్తున్నామని, ములుగును అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్రర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణ్, కౌన్సిలర్ పౌడాల ఓం ప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.







