హెచ్టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం
ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): హెచ్టీఈ 11 కేవీ, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ అమల్లో ఉందని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ. ఆనందం తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 6 హెచ్టీఈ సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. వినియోగదారులు TGNPDCL పోర్టల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే UID నంబర్ ఉత్పత్తి అవుతుందని, ఆ ద్వారా దరఖాస్తు స్థితిని ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 11 కేవీ దరఖాస్తుల ఫీజిబిలిటీని రెండు రోజుల్లో పరిశీలించి సమాచారం SMS రూపంలో పంపిస్తారని, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ దరఖాస్తులను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలతో మంజూరు చేస్తారని తెలిపారు. సింగిల్ విండో విధానం వల్ల వినియోగదారులు కార్యాలయాలకు తిరుగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.






