మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు బ్లాస్ట్
– యువకుడికి తీవ్రగాయాలు
– తప్పిన ప్రాణాపాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రెజర్ బాంబు పేలుడుతో ఉలిక్కి పడ్డారు. మండలంలోని వీరభద్రవరం, ఇప్పగూడెం అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడు వంటచేరుకు కోసం అడవికి వెళ్లాడు. అయితే అప్పటికే మావోయిస్టులు అమర్చి ఉంచిన ప్రెజర్ బాంబు పై అడుగు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఎగిరి కింద పడ్డ కృష్ణమూర్తి కాలు నుజ్జు కాగా, తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన వెంకటా పురం ప్రభుత్వ వైద్యశాలకు 108 అంబులెన్సులో తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు, అక్కడి నుంచి ఎంజీఎం వరంగల్ తరలించి నట్లు సమాచారం. ప్రెజర్ బాంబు పేలుడుతో వెంకటాపురం పోలీస్ శాఖ అప్రమత్త మైంది. గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.