0-5 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు

Written by telangana jyothi

Published on:

0-5 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మంతెన మౌనిక ప్రారంభించారు. డాక్టర్ మౌనిక మాట్లాడుతూ మండలంలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మండల పరిధి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. పీ హెచ్ సీ పరిధిలోని తొమ్మిది సబ్ సెంటర్ల లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మంతెన మౌనిక తెలిపారు. ఆదివారం కాటారం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు పోలియో చుక్కలు కేంద్రాలను సందర్శించారు. మేడిపల్లి, కాటారం, గారెపల్లి బస్ స్టాండ్ లలో పోలియో చుక్కల కేంద్రం లో పని తీరును పరిశీలించారు.

Leave a comment