ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ ప్రాంతం లో పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, పీసా నిబంధనలు ఉల్లంఘించిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం ఇసుక సొసైటీ గ్రామసభను రద్దు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్తు ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసా నిబంధన 242(డి) ఉల్లంఘించిన మండల ఎంపీడీఒ, ఎంపీఒ లపై ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలన్నారు. గిరిజన ఇసుక సొసైటీలో గిరిజనేతరులు, అధికార పార్టీ నాయకుల పెత్తనం చేస్తున్నారని చట్టంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారన్నారు. పిసా హాబిటేషన్ పరిధిలో ఓటర్లందరితో గ్రామసభ నిర్వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1996 స్వయం పాలన గ్రామసభ చట్టం స్వర్గీయ డాక్టర్ బి.డి శర్మ ఐఏఎస్ గారి ఆలోచనతో రూపొందించబడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల ఉపాధి అభివృద్ధి అవకాశాల కోసం ఏర్పాటు చేసిన గిరిజన ఇసుక సొసైటీల చాటున దాగి రాజకీయ దళారులుగా, బినామీలుగా మారిపోయి ఆదివాసి చట్టాలను ఇసుకలో పాతేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అధికార పార్టీ నాయకులకు జిల్లా మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయని, మంత్రి అనుచరులమంటూ ఏజెన్సీలో హల్చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేసి, ఆదివాసి సంక్షేమ చట్టాలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని అన్నారు. వెంకటాపురం మండలం లో గిరిజన ఇసుక సొసైటీల కొరకు ఏర్పాటుచేసిన పీసా గ్రామసభలు 242(డి) నిబంధనలు పాటించ లేదన్నారు. పిసా నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన ఇసుక సొసైటీల గ్రామసభలను రద్దు పరిచి మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలంటే అధికార పార్టీ నాయకుల హస్తం ఆశీస్సులు ఉండాలా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ గులాంగిరి చేస్తున్నారని తక్షణమే వీరభద్రవరం పిసా గ్రామసభను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్సకృష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, సందీప్, బొగ్గుల మల్లయ్య, గోపి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.