పొగమంచు పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
– వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు
వెంకటాపురం, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి : శీతాకాలం కారణంగా తెల్లవారుజామున సాయంత్రం రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడుతున్నందున వాహనదారులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై కే. తిరుపతిరావు సూచించారు. పొగమంచు ప్రభావంతో దృశ్యమానం తగ్గిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరం లేని ప్రయాణాలు నివారించాల్సిందిగా సూచించారు. వాహనాలకు హైబీం లైట్లు, ఫాగ్ లాంపులు తప్పనిసరిగా ఉపయోగిం చాలని ఎస్సై పేర్కొన్నారు. ప్రధాన రహదారుల మధ్యలో వాహనాలను పార్క్ చేయకుండా, అత్యవసర పరిస్థితుల్లో రహదారి అంచున పార్కింగ్ చేసి, పార్కింగ్–హజార్డ్ లైట్లు ఆన్ చేయాలని సూచించారు. ముందున్న వాహనం నుండి సాధారణ దూరం కన్నా మూడు రెట్లు ఎక్కువ సేఫ్టీ డిస్టెన్స్ పాటించాలన్నారు. రహదారి దాటేటప్పుడు రెండు వైపులా పరిశీలించి దాటాలని, ఆకస్మికంగా రోడ్డుపైకి రావద్దని ప్రజలకు సూచించారు. శీతకాలం పొగమంచు సమయంలో అందరూ అత్యంత అప్రమత్తతో ప్రయాణించి, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని ఎస్సై తిరుపతిరావు ప్రజలకు దృఢంగా సూచించారు.






