మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రులు
కాలేశ్వరం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన మహా కుంభాభిషేకంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ తోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శృంగేరి పీఠానికి సంబంధించిన తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో మహాకుంభాభిషేకం జరుగుతున్నంత సేపు ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద వెలసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ప్రాచీనమైనది, ప్రాశస్త్యమైనదని అన్నారు. ముక్తేశ్వర, కాళేశ్వరులు కొలువైన దేశంలోనే ఏకైక దేవస్థానం తెలంగాణలో వుండటం మన అదృష్టమని అన్నారు. గంగా, యమునా, సరస్వతి సంఘమైన ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరుగు తున్న సమయంలోనే కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మహాకుంభాభిషేక ఘట్టం ఆవి ష్కృతం కావడం గొప్ప అనుభూతినిచ్చిందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కారాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి భక్తులతో సదుపాయాల గురించి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్జేసీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.