వెంకటాపురంలో మేడారం సందడి : ఖాళీ అవుతున్న గ్రామాలు
– ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని వెంకటాపురం మీదుగా మేడారం వాహనాల శ్రేణి.
వెంకటాపురం నూగురు. తెలంగాణా జ్యోతి ప్రతినిది : మేడారం మహా జాతర సందర్భంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల్లో మేడారం మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల సందడి నెలకొన్నది. మండలాలలోని అనేక గ్రామాలు జాతరకు తరలి వెళుతుండటంతో గ్రామాల్లో వృద్ధులు మాత్రమే దర్శనమిస్తున్నారు. బుధ, గురువారాలు లో అమ్మ వార్ల నిండు జాతర లో పాల్గొని మొక్కులు చెల్లించుకునేందుకు, ట్రాక్టర్లకు గూళ్ళు కట్టుకొని, కోళ్లు మేకలను వంట సామాగ్రిని , బంధు మిత్రులతో చలో మేడారం అంటూ హాపీగా మేడారం డి.జే. పాటలతో వందలాది వాహనాలు తరలి వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చూద్దాం రారండి అంటూ, అమ్మ వార్ల నామస్మరణతో తరలి వెళ్తున్నారు. భద్రాచలం ప్రాంతం నుండి మణుగూరు పట్టణం మీదుగా ప్రధాన రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ ఉండటంతో, మేడారం వెళ్ళే వాహనాల శ్రేణి ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని, దుమ్ము గూడెం ,చర్ల మీదుగా వెంకటాపురం నుండి జగన్నాధపురం జక్షన్ మీదుగా పూసూరు గోదావరి వంతెన ఎటురునాగారం తాడ్వాయి మీదుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వాహనాలు తరలి వెళ్తున్నాయి. టీఎస్ ఆర్టీసీ సత్తుపల్లి డిపోకు చెందిన ప్రత్యేక బస్సులు చర్ల, వెంకటా పురం, ఏటూరు నాగారం నుండి మేడారంకు స్పెషల్ బస్ సర్వీసుల ను నిర్వహిస్తున్నారు. వేలాది మంది మేడారం వెళ్ళే భక్తులు, ప్రయాణికులు స్పెషల్ బస్సులలో అమ్మ వార్ల గద్దే ల వరకు బస్ ప్రయాణీకులు చేరుకునే విధంగా, ఆర్టీసీ బస్సులను నిర్వహిస్తుండటంతో మేడారం భక్తులు స్పెషల్ బస్సులను ఆదరిస్తున్నారు. ఈ మేరకు వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదుట సత్తుపల్లి డిపో సిబ్బంది, టెంటు వేసి మైక్ ద్వారా మేడారం ప్రయాణికులు, భక్తులను ఆహ్వానిస్తున్నారు. స్పెషల్ బస్సులు 50 శాతం ప్రయాణికులు ఎక్కిన వెంటనే మేడారంకు బయలుదేరి వెళుతున్నా యి. వెంకటాపురం నుండి మేడారం వరకు ఎటునాగారం మధ్య, మధ్యలో ఉన్న గ్రామాల్లో సైతం మేడారం భక్తులను స్పెషల్ బస్సులలో ఎక్కించుకొని, సత్తుపల్లి డిపో ఆర్టీసీ సిబ్బంది మేడారం భక్తులకు సేవలందిస్తున్నారు. కాగా భద్రాచలం ప్రాంతం నుండి వందలాది వాహనాల శ్రేణి, చర్ల, వెంకటాపురం మీదుగా మేడారం జాతరకు తరలి వెళ్లుతుండడంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. అలాగే మంగళవారం వెంకటాపురం లో గిరిజన సంత కావడంతో వెంకటాపురం పట్టణంలోని సుమారు మూడు కిలోమీటర్ల ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలు వేగం నియంత్రణ తో వాహ నాలు తరలి వెళ్తున్నాయి. మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం శెలవలు ప్రకటించటంతో భక్తులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఆబాల గోపాలం, అశేష ప్రజానీకం రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలి వెళ్లేందుకు, చలో మేడారం జై సమ్మక్క జై జై సార్లమ్మ తల్లి అంటూ మొక్కుబడును చెల్లించుకునేందుకు తరలి వెళ్లడంతో అనేక గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. కాగా ప్రధాన వాణిజ్య మిర్చి పంట వ్యవసాయ పనులకు మేడారం మహా జాతర సందర్భంగా అంతరాయం ఏర్పడింది. తమ ఇలవేల్పు కోరిన వరాలు ఇచ్చే, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి కీ మొక్కుబడులు చెల్లించి, ఆనందకరమైన జీవితం గడుపుకునేందుకు, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి మహా జాతరకు ఈ ప్రాంతంలోని వేలాదిమంది భక్తులు, జై సమ్మక్క తల్లి జై జై సారలమ్మ తల్లి చల్లగా చూడాలంటూ బస్సులు, ట్రాక్టర్లు, వ్యాన్ల కు ఇతర ప్రైవేటు వాహనాలుకు గూడులు కట్టుకొని తరలి వెళ్తున్నారు. దీంతో అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో వచ్చే పోయే మేడారం వాహనదారులకు అల్పాహారం,తేనీరు , ఇతర టిఫిన్ సెంటర్లలో మేడారం భక్తులు వెళ్లే భక్తులు , కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి.