వాజేడులో రూ.3.91లక్షల గంజాయి పట్టివేత
– ఇద్దరు వ్యక్తుల అరెస్టు
– వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరువు రు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 15కిలోల గంజాయి పట్టుబడింది. అందుకు సంబంధించిన వివరాలను వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ వెల్లడించారు.వాజేడు మండల కేంద్రంలో పొన్నాడ దుర్గ శివ, కుంజా నగేష్ అనే ఇరువురు యువకులు అనుమానా స్పదంగా వెళ్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద నుండి రూ. 3.91 లక్షల విలువగల 15కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ యువత, ప్రజలు గంజాయి మహమ్మారి బారిన పడవద్దని, ఎవరైనా గంజాయి విక్రయిస్తే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఏఎస్పి శివం ఉపాధ్యాయ కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎస్సై రుద్ర హరీష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.