వెంకటాపురంలో ప్రభుత్వ భూముల కబ్జాను అరికట్టాలి
– కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ కు వినతి.
– తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామ్ చందర్ రావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం లో ప్రభుత్వ భూముల కబ్జాను అరికట్టి, కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచందర్రావు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వెంకటాపురంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచందర్ రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురంలో విలువైన (జడ్) సర్వేనెం.69, మరియు సర్వే నెంబర్ 4/1 లో గల ప్రభుత్వ భూమిని రెవెన్యూ ఉద్యోగి ,మరియు కొంత మంది కబ్జా చేసిన రెవెన్యూ ఉద్యోగి, ప్రైవేటు వ్యక్తులపై గతంలో పలుమార్లు పిర్యాదులు చేసామన్నారు. రెవెన్యూ ఉద్యోగిపై అవినీతిని నిగ్గు తేల్చక పోవడంలో ఉన్నత అధికారుల ఆంతర్యం ఏమిటీ అని ప్రశ్నించారు. అలాగే బి.సి మర్రి గూడెం పంచాయతీ లో సర్వే నెంబర్ 4/1 లో ప్రభుత్వ భూమిని గుర్తిస్తూ అప్పటి ములుగు సబ్ కలెక్టర్ సరిహద్దు సిమెంటు దిమ్మలు ఏర్పాటు చేసారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారు శిక్షార్హులని బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు. దిమ్మలను పగలగొట్టి భూ అక్రమణలు చేసి క్రయ విక్రయాలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి సరిహద్దు దిమ్మలను థ్వంసం చేసి ఆక్రమణలు చేసిన వారిపై క్రిమినల్ కేసులతో చర్యలు తీసుకొని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం వెంకటాపురం మండల అధ్యక్షులు తాటి లక్ష్మణరావు, పూనెం పవన్ కుమార్, పోడెం రాజేష్, కోరం ప్రసాద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.