భద్రాచలం సీతా రాముల కళ్యాణానికి సుగంధ హారాలు.
– శ్రీరామ నవమి సందర్భంగా స్వామికి సమర్పించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం సీతారాముల కళ్యాణంలో అరుదైన సుగంధ హారాలతో ఆలయ అర్చకులు స్వామి వారికి కళ్యాణం జరపనున్నారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణానికి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి కేరళ రాష్ట్రం నుండి స్వామి వారి కోసం యాలకులతో సుగంధ హస్త కళాకారుల చేత ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హారాలను మంగళవారం భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం అధికారులు, అర్చకులకు సమర్పించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో బుధవారం జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ గా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన యాలకుల హారాలను బహూకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని దేవుడి ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజలపై ఉండా లన్నారు. ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్టు తెలిపారు. శ్రీరామనవమి రోజు సుగంధ హారాలను స్వామి వారికి కల్యాణ మండపంలో సమర్పించాల నుకున్నామని కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లో ఉన్నందున సుగంధ హారాలను దేవస్థానం అధికారులకు ఒకరోజు ముందుగానే మంగళవారం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎఈవో రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరాజు, వాసు, ఆలయ అర్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.