సమస్యల సుడిగుండంలో బీసీ బాలుర వసతి గృహం
– పల్లెనిద్రలో వెలుగు చూసిన సమస్యలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలోని బీ.సీ బాలుర వసతిగృహంలో జిల్లా కలెక్టర్ ఆదేశంపై మండల పంచాయతీ ఆఫీసర్ ఆర్. హనుమంతరావు గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 52 మంది విద్యార్థులకు గాను 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుండి 10 వ తరగతి వరకు పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. దశాబ్దాల క్రితం హాస్టల్ భవనాలను ఊరు చివర వర్షపు నీరు ప్రవహించే,ప్రాంతంలో నిర్మించారు. సంవత్సరం పొడువున తేమతో, బురదతో ఉండే ప్రదేశంలో వసతి గృహాన్ని నిర్మించారు. అంతేకాక గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన వెంటనే వసతి గృహం ఆవరణలోకి గోదావరి వరద ఊరు ప్రక్కన వుండే గోదావరి పాయ నుండి చొచ్చుకు వస్తున్నది. పలుమార్లు గోదావరి వరద పోటు నీరు, హాస్టల్ ఆవరణ లోకి చేరు కోవడంతో , హాస్టల్లో వరద తగ్గే వరకు ఖాళీ చెఇఃచటం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అంతేకాక వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో, పశువులు యదేచ్చగా సంచరిస్తుంటాయి. వేసిన మొక్కలు సైతం పశువుల పాలవుతున్నాయి. ముఖ్యంగా హాస్టల్ ప్రధాన గేటు వద్ద డ్రైనేజీ భారీ వర్షాలకు వరదలకు కొట్టుకుపోవడంతో, విద్యార్థులు రాక పోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహం ముందు డ్రైనేజీ పై సిమెంట్ పైపులు వేసి కల్వర్టు నిర్మించాలని దశాబ్దాల కాలంగా అధికారులకు విన్నవించుకుంటున్న పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాభాలో 80 శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బి.సి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హాస్టల్ ముందుభాగంలో డ్రైనేజీ కల్వర్టు నిర్మించాలని, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటిపై నివేదిక ను జిల్లా అధికారులకు పంపనున్నట్లు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మండల పంచాయతీ అధికారి ఆర్. హనుమంతరావు తెలిపారు .ఈ కార్యక్రమంలో వసతిగృహం సంక్షేమ అధికారి కుమార స్వామి, సిబ్బంది తదతరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సక్రమంగా మెను చార్ట్ అమలవుతుందని, పదవ తరగతి విద్యార్థులకు వసతి గృహంలోనే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా ట్యూషన్ నిర్వహిస్తున్నట్లు, సంక్షేమ అధికారి కుమార స్వామి తెలిపారు.