కరకట్ట నిర్మాణ పనులు, మారేడు గుండ చెరువు కట్ట నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి
– వరదల వలన ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– ముంపు గ్రామాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి
– నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి సీతక్క
తెలంగాణ జ్యోతి, హైదారాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్క ర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో నీటిపారుదలశాఖ అధికారులతో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సమావేశం నిర్వహించారు. ఏటూరునాగారం మండల పరిధి రాంనగర్ గ్రామం నుండి మొదలుకొని మంగపేట మండలం పొదు మూరు వరకు కరకట్ట పనులు ప్రారంభించాలన్నారు. వర్షాకాలం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, వరదల వలన ప్రాణనష్టం జరగకుండా అధికారులు ముంపు గ్రామాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నాగారం నుండి రామన్న గూడెం ఎక్కల వరకు నిర్మించిన కట్ట మరమ్మతులు, తూముల రిపేర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వం కరకట్ట మరమ్మతుల కోసం కేటాయించిన 6 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని, ప్రజా ప్రభుత్వం లో ఇలాంటివి ఉపేక్షించేది లేదని కరకట్ట నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు పూర్తి స్థాయిలో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు డిలే అయ్యాయని, ఇకనైనా పనులు వేగవంతం చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. గత వర్ష కాలం విపరీతంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వెంకటా పూర్ మండలం లోని భుర్గుపేట మారేడు గుండ చెరువు కట్ట తెగి పోవడం తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన టెండర్ ప్రక్రియ పనులు పూర్తి చేసి చెరువు కట్ట నిర్మాణ పనులు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఐఏఎస్ తో పాటు, ఈ ఎన్ సి లు, ఎస్ సి లు, ముఖ్య అధికారులు సమీక్ష లో పాల్గొన్నారు.