ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో హామీలు అమలు చేస్తాం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం మండలంలోని ధన్వాడ, విలాసాగర్ గ్రామాలలో శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రభుత్వానికి సంబం ధించిన పథకాలన్నీ ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయని తెలిపారు. నియోజ కవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను దన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించారు. ప్రజలు విన్నవించిన ఆయా సమస్యలపై శ్రీధర్ బాబు స్పందిస్తూ పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించవద్దని కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావును ఆదేశించారు. గృహ అవసరాల కోసం ఇసుక తెచ్చుకునేందుకు సరైన విధానం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను ఆదేశించారు. మండలంలో ట్రాక్టర్ ఓనర్లు అసోసియేషన్ ఏర్పాటై ఇతర గ్రామాల నుండి ఇసుక తీసుకురాకుండా అడ్డుకుంటున్నారని, ఫలితంగా ఇసుక రేటు రెండు రెట్లు పెరిగిందని పలువురు మంత్రికి విన్నవించారు. అనంతరం మండలంలోని విలాసా గర్ గ్రామంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకానీ సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు విలాస్ రావు, ప్రభాకర్ రెడ్డి, కోట రాజబాబు, వామన్ రావు, చీమల సందీప్, అందే సత్యనారాయణ, జాడి మహేశ్వరి, చీటూరి మహేష్, దండు రమేష్, అయిత రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.