ఏటూరునాగారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
రైతు పండించిన ప్రతి గింజ అమ్ముడయ్యే వరకు అండగా ఉంటాం
ఏటూరునాగారం, మే21, తెలంగాణజ్యోతి: మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గురువారం అధికారులతో కలిసి సందర్శించి వడ్ల తూకం, రవాణా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్ల తూకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వెంటనే సమాచారం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. పండించిన వడ్లను తరలించేందుకు తగినన్ని వాహనాలు అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రైతు పండించిన ప్రతి గింజ అమ్ముడయ్యే వరకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








