ఘనంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు
పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానంతో ఆధ్యాత్మిక సందడి
జయశంకర్ భూపాలపల్లి, మే 21, తెలంగాణ జ్యోతి: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 గంటలకు పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ పవిత్ర కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆధ్యాత్మిక సలహాదారు గోవింద హరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాల కోసం తరలివస్తుండటంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. పుష్కరాల కాలంలో భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.








