చిన్నబోయినపల్లిలో బడిబాట ప్రభావం..
సర్కారు బడికి భారీ మద్దతు, ప్రైవేట్‌కు చెక్..
టీచర్లే తమ పిల్లలను చేర్పించి నమ్మకం పెంపు..
ఏటూరు నాగారం మండలంలో ఊరి నిర్ణయం..
ఏటూరునాగారం, ఏప్రిల్ 17, తెలంగాణజ్యోతి: మండలంలోని చిన్న బోయినపల్లిలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సర్కారు బడిపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ బడిబాట కార్యక్రమం ప్రభావంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై దృక్పథం పూర్తిగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించడం ఈ కార్యక్రమానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన లభిస్తోందని, ఇక్కడ చదివితేనే సమాజంలో చైతన్యం పెరుగుతుందని వారు స్పష్టం చేయడంతో తల్లిదండ్రుల్లో ఉన్న సందేహాలు తొలగాయి. ఇదే సమయంలో ఒక విద్యావేత్త ప్రైవేట్ స్కూల్స్‌లో అధిక ఫీజులు ఉన్నప్పటికీ పిల్లల్లో సహజ ప్రతిభ పెరగడం లేదని, కార్పొరేట్ విద్య మార్కులకే పరిమితమవుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య సర్కారు బడుల్లోనే లభిస్తుందని నమ్మి ఆమె తన పిల్లలను ఇక్కడ చేర్పించడం గ్రామస్థులను ఆలోచింపజేసింది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా సుమారు రూ.1.10 లక్షలు ఖర్చు చేస్తూ యూనిఫామ్‌లు, పుస్తకాలు సహా 21 రకాల సదుపాయాలు, పోషకాహారం అందిస్తోందని అధికారులు తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమం స్ఫూర్తితో గ్రామ సర్పంచ్ సహా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని సామూహికంగా ప్రతిజ్ఞ చేయడం గ్రామంలో విద్యా మార్పుకు సంకేతంగా నిలిచింది.









