మంథని ప్రజలను అవమాన పరుస్తున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలి
కాటారం, ఏప్రిల్ 15 తెలంగాణ జ్యోతి: మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరుస్తూ మాట్లాడుతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబును ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, అయినప్పటికీ పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. మహనీయుల మాల విరమణ పేరుతో ప్రాంత ప్రజలను హేళన చేయడం సరైంది కాదని సూచించారు. మంథని ప్రజలు విద్యావంతులు, మేధావులు, పోరాటయోధులుగా చైతన్యవంతంగా మారి ప్రతి ఎన్నికలో స్పష్టమైన తీర్పు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజలను కించపరిచేలా మాట్లాడడం పుట్ట మధుకు అలవాటైందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని, వైఖరి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో విద్యాసంస్థలు నెలకొల్పి రాజ్యాంగంపై అవగాహన పెంచుతున్న శ్రీధర్ బాబును విమర్శించడం అవివేకమని అన్నారు. నూతన గృహాలు, పెన్షన్లు నిరంతర ప్రక్రియలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు గదవెన దేవేందర్, కడారి విక్రమ్, కోడి రవి, భూపెల్లి రాజు, దోమల సమ్మయ్య, సత్యం, వినయ్, మధు తదితరులు పాల్గొన్నారు.









