ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.1.5 లక్షల సాయం
బిఆర్ఎస్ చొరవతో గిరిజన విద్యార్థినికి సకాలంలో ఆర్థిక తోడ్పాటు
వాజేడు, ఏప్రిల్15, తెలంగాణజ్యోతి : ఆర్థిక ఇబ్బందులతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన గిరిజన విద్యార్థిని తల్లాడి నవ్యజ్ఞపికకు బిఆర్ఎస్ పార్టీ సకాలంలో రూ.1.5 లక్షల ఆర్థిక సాయం అందించింది. తల్లాడి శేషయ్య, యశోద దంపతుల కుమార్తె అయిన నవ్యజ్ఞపిక కరీంనగర్లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆర్థిక స్తోమత లేక చదువు నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో విషయం తెలుసుకున్న వాజేడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య జిల్లా నాయకులకు వివరించారు. వెంటనే స్పందించిన జిల్లా నాయకులు గూడవర్తి నరసింహమూర్తి, ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సాయం ఏర్పాటు చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ జల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ చేతుల మీదుగా విద్యార్థిని తల్లిదండ్రులకు సహాయం అందజేశారు. సకాలంలో అందిన ఈ సాయం వల్ల చదువు కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల మాజీ కోఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, పాయం జానకి రమణ, ముడుంబ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









