భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గండ్ర సత్యనారాయణ రావు
కాటారం, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, వివిధ వర్గాల ప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి రూ.7 కోట్లు, రహదారులకు రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గణపురం మండలం మైలారంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. భూపాలపల్లి–గూడెప్పాడు నాలుగు లేన్ల రహదారికి రూ.664 కోట్లు, బైపాస్ రోడ్డుకు రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధికి వ్యాపారులు సహకరించాలని కోరుతూ, రోడ్ల విస్తరణలో దుకాణాలు తొలగితే షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా ప్రత్యామ్నాయ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సిటీ స్కాన్, వెంటిలేటర్ల సదుపాయాలు కల్పించామని, త్వరలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వం, హక్కులు అందించారని, విద్య ద్వారా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ రాజ్యాంగ విలువలకు కట్టుబడి జీవించాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి, రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.









