ములుగు మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల
ములుగు, ఫిబ్రవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అర్బన్ పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలతో కూడిన జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. వార్డు1 జీవంతరావుపల్లి లోని ఎంపీపీఎస్ పాఠశాలలో, 2 నుంచి 4వరకు ములుగు జెడ్పీహెచ్‌ఎస్ బాలుర హై స్కూల్ భవనంలో, వార్డు 5 నుంచి 7 వరకు ములుగు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (గర్ల్స్ స్కూల్ క్యాంపస్) భవనంలో, వార్డు 8, 9, 14లకు జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 3 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వార్డు 10, 11లకు బండారుపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, వార్డు 12, 13లకు బండారుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో, వార్డు 15 నుంచి 18 వరకు ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో, వార్డు 19, 20లకు ములుగు జెడ్పీహెచ్‌ఎస్ (కాలేజీ గ్రౌండ్) లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని పోలింగ్ స్టేషన్లు సాధారణ ఓటర్ల కోసమే కాగా, ఎక్కువశాతం స్టేషన్లను హైపర్ సెన్సిటివ్‌గా గుర్తించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి గది సంఖ్య, కవరయ్యే ఇళ్ల పరిధి, ఓటర్లు చేరుకోవాల్సిన గరిష్ట దూరం, అక్షాంశ–రేఖాంశాల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,963 ఓట్లు ఉండగా, అందులో 7,300 మంది మహిళలు, 6,661 మంది పురుషులు, ఇద్దరు ఇతరులు ఉన్నారని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.






