దళిత హక్కులకై కోటి సంతకాల సేకరణ
- కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ పిలుపు
- డిసెంబర్ 4న చలో ఢిల్లీ
- మొదటి సంతకం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సామాజిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దళితుల హక్కుల కోసం రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వడం కోసం డిసెంబర్ 4న ఏర్పాటుచేసిన చలో ఢిల్లీ కార్యక్రమం లో దళితులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొదటి సంతకంను మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు చేత చేపించారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ76 ఏళ్ల స్వాతంత్ర భారత దేశం లో నేటికీ దళితులు అంటరానితనం, కులవివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారని, అధికారం లో ఉన్న పాలకులు దళితులను భూమికి, సంపదకు, విద్యకు, వైద్యానికి దూరం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించు కోవాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు విషయంలో పోరాటాలు చేయాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో వేలాది ఎస్సీ, ఎస్టీ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఖాళీ ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సబ్ ప్లాన్ చట్టం ఉన్నప్పటికి దాన్ని అమలు చేయడం లేదని ఎస్సీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు అనేక హక్కులు, చట్టాలు కల్పించారని వాటిని లేకుండా చేయడానికి భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా దళితులపై జరుగుతున్న దాడులను, కుల వివక్షను అరికట్టవలసిన అవసరం ఉందని, రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ జీవోలను అమలుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ప్రభుత్వ భూములను పంచాలని వారు డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టం పరిరక్షించుకోవాలని అన్నారు.
1 thought on “దళిత హక్కులకై కోటి సంతకాల సేకరణ”