అనుకున్న గడువులో మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం
తాత్కాలిక పనులు కాదు.. శాశ్వత అభివృద్ధికే ప్రాధాన్యం…
200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ
ఆదివాసీ గిరిజనుల మనోభావాలకు భంగం లేకుండా పనులు
— రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ములుగు ప్రతినిధి, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : మేడారం మహా జాతరను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు రెండు వందల సంవత్సరాల కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొక్కిన మొక్కులు తీర్చుకునే తల్లులను దర్శించుకోవడానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకుంటు న్నారని, వారి సౌకర్యాల దృష్ట్యా ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. మంగళవారం మేడారంలో జరిగిన పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. సాండ్ స్టోన్ శిల్పాలు, క్యూ లైన్ నిర్మాణం, గోవిందరాజు–పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణం, ఆలయ ఫ్లోరింగ్, ప్రహరీ స్తంభాలు, చిలుకలగుట్ట రోడ్డు, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్‌టీసీ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, గుత్తేదారులతో జాతర అభివృద్ధి పనుల పురోగతిపై కూలంకషంగా సమీక్ష నిర్వహించి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్ల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను డిసెంబర్ 31వ తేదీలోపు పూర్తి చేయాలని, మిగిలిన పనులను జనవరి 5వ తేదీలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ప్రధాన ద్వారం పనులు కూడా అదే గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణం, గద్దెల పరిసర ప్రాంతాల్లో వేగంగా లైటింగ్ పనులు పూర్తి చేయాలని, రహదారుల ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, హరిత వై జంక్షన్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని తెలిపారు. జాతర సమయంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వతంగా వాటర్ ట్యాంకులు నిర్మించాలని ఆదేశించారు. జాతరకు వచ్చే అన్ని రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని, ఐటిడిఏ ఆధ్వర్యంలో తాత్కాలిక పనులకు కాకుండా శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సుందరీకరణలో భాగంగా గ్రాస్ ప్లాంటేషన్, రహదారుల ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని తెలిపారు. గత జాతరతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య సుమారు 200 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాలరాతి శిల్పాలతో గద్దెల ప్రాంతంలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ జనవరి 5వ తేదీలోపు వంద శాతం పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మేడారం మహా జాతరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 29 ఎకరాల భూసేకరణతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనంతరం మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ, వారి సంప్రదాయాలకు భంగం కలగకుండా మేడారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పాలరాతి శిల్పాల సరఫరా కారణంగా ఆలయ పునరుద్ధరణ పనుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శిల్పాలు రూపొందిస్తున్నామని చెప్పారు. అమ్మవార్ల దయతో సకాలంలో పనులు పూర్తి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పీఆర్, ఈఎన్‌సీ అధికారులు, ఆర్డీఓ వెంకటేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్టులు, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







